🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

‘మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు?’

Main Image

కన్నీళ్లు పెట్టుకుంటూ కొండా సుష్మిత ఆవేదన.. రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌: మాజీ మంత్రి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లిదండ్రులను ఉద్దేశించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఏ తప్పు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

“అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే నేను అలా మాట్లాడేదాన్ని కాదు” అంటూ సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభించి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై సీఎం రేవంత్‌రెడ్డి ఇంత పగ పెంచుకుంటారని తాను ఊహించలేదన్నారు.

తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని ఇప్పటికీ చెబుతున్నానని, ఒకవేళ తప్పు ఉంటే తన తప్పుగా భావించి తనపై కేసు పెట్టి జైలుకు పంపాల్సిందని అన్నారు. “పార్టీలో నేనైనా ఉండాలి, ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి దిగజారుతాడా?” అని ప్రశ్నించారు.

తాను కాంగ్రెస్‌ పార్టీని ఎక్కడా కించపరచలేదని, కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడానని సుష్మిత పేర్కొన్నారు. తన తల్లి చేసిన ఒక్క తప్పును చూపించాలని డిమాండ్‌ చేశారు. ఆమె నిర్వహించిన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదని అన్నారు.

“సో-కాల్డ్‌ రేవంత్‌ మీడియా కావాలనే మా అమ్మ స్థాయిని తగ్గిస్తోంది. ఒక ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు” అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తన తల్లిని సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టమని ఆమె సహచర మంత్రి ఎందుకు చెబుతారని, ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న తన తండ్రి రేవంత్‌రెడ్డిని తిట్టమని ఎందుకు చెబుతారని సుష్మిత ప్రశ్నించారు.

అధిష్ఠానం మొత్తం తన తల్లికి మద్దతుగా ఉందని, అయితే సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరుల అక్రమాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిపై తర్వాత మాట్లాడతానని తెలిపారు.

తన తల్లి కొండా సురేఖ, తండ్రి కొండా మురళి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతారని సుష్మిత స్పష్టం చేశారు. తన తల్లిని ఇంత అవమానిస్తారని ముందే తెలిసి ఉంటే తాను ఆ విధంగా మాట్లాడేదాన్ని కాదని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.
🏠 Home