🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

అసెంబ్లీ ముందు ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు

Main Image Additional Image Additional Image
కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మందిపై FIR.. పోలీసులతో ఘర్షణలపై ఆరోపణలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8


తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ ముందు జరిగిన ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లు కూడా FIRలో ఉన్నట్లు తెలుస్తోంది.

విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయడం, పోలీసుల కాలర్లు పట్టుకోవడం, విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులను దూషించడం, బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. మహిళా పోలీసుల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

- సీఐ ఫిర్యాదుతో కేసు నమోదు

సీఐ బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు, మీడియా ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

- ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్ట్

అసెంబ్లీ ముందు చోటుచేసుకున్న ఘర్షణల వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా 14 మంది ఎమ్మెల్యేలపై FIR నమోదైనట్లు వార్తలు రావడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడిని రాజేసింది.

అసెంబ్లీ ప్రాంగణం వద్ద జరిగిన పరిణామాలు కేసులు, అరెస్టుల దిశగా మలుపు తిరగడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
🏠 Home