🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

చాహత్ బాజ్‌ పాయ్ దిశలో హన్మకొండ అభివృద్ధి!

Main Image Additional Image Additional Image Additional Image
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ):..


* పార్కింగ్‌, డ్రైనేజీ, తాగునీరు.. పర్యాటక రంగానికి భారీ ప్రణాళికలు ,


హన్మకొండ నగర రూపురేఖలు మార్చే దిశగా భారీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలకు కొత్త హంగులు అద్దడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్మన్‌ ఐఏఎస్‌ చాహత్ బాజ్‌ పాయ్ తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జిల్లా, నగర అభివృద్ధి ప్రణాళికలను ఆమె వెల్లడించారు.

అశోక హోటల్‌ ఎదురుగా మల్టీలెవల్‌ పార్కింగ్‌

హన్మకొండలో పార్కింగ్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్‌ తెలిపారు. అశోక హోటల్‌కు ఎదురుగా ఉన్న కుడా స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

పార్కింగ్‌ కోసం మాత్రమే స్థలాన్ని వినియోగించకుండా ముందు భాగంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసి లీజుకు ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు. నగర పార్కింగ్‌ సమస్య పరిష్కారంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

హన్మకొండ చౌరస్తాకు కొత్త రూపు

హన్మకొండ చౌరస్తాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చాహత్‌ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ బస్‌స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కలుపుకొని ప్లాజా తరహాలో అభివృద్ధి చేసే ప్రతిపాదనపై ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

ఈ ప్రతిపాదనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా, వాణిజ్య వసతులు కల్పించడంతో పాటు చౌరస్తాకు ఆకర్షణీయమైన రూపం తీసుకురావడమే లక్ష్యమన్నారు. మల్టీలెవల్‌ పార్కింగ్‌, చౌరస్తా అభివృద్ధి పూర్తయితే ప్రధాన కూడలిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని వివరించారు.

అండర్‌ డ్రైనేజీకి రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు

హన్మకొండ, కాజీపేటతో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సుమారు 10 ఎకరాల భూమిని గుర్తించినట్లు చెప్పారు.

వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణకు దీర్ఘకాలిక పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సంబంధిత అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారని చెప్పారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేయనున్నట్లు వివరించారు.

తాగునీటి వ్యవస్థకు రూ.500 కోట్లు

గ్రేటర్‌ వరంగల్‌ వాటర్‌ వర్క్స్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

కొత్త పైపులైన్ల నిర్మాణం, పాత పైపులైన్ల మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, కొత్త నిర్మాణాలు, నీటి ట్యాంకులు, నీటి నిల్వ ప్రాంతాల ఏర్పాటు వంటి పనులకు నిధులు వినియోగించనున్నట్లు వివరించారు. నగర భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నట్లు చెప్పారు.

భద్రకాళి, వరంగల్‌ కోటకు పర్యాటక హంగులు

భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.90 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించిందని కలెక్టర్‌ తెలిపారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

భద్రకాళి బండ్‌ వద్ద రాతి నిర్మాణ పనుల కోసం రూ.19 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులను ఆయనకు చూపించే ఆలోచన ఉందన్నారు.

వరంగల్‌ కోట చుట్టూ ఉన్న సుమారు నాలుగు కిలోమీటర్ల రక్షణ కందకాన్ని పునరుద్ధరించి బోటింగ్‌ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖిలా వరంగల్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

నగరంలో ముంపు సమస్యను తగ్గించేందుకు రక్షణ గోడలు, డ్రైనేజీలు, నాలాల అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

దేవునూరు గుట్టలకు పర్యాటక హంగులు

ధర్మసాగర్‌ మండలంలోని దేవునూరు గుట్టలను అటవీశాఖ సహకారంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చాహత్ బాజ్‌ పాయ్ తెలిపారు. ధర్మసాగర్‌ జలాశయం, అటవీ ప్రాంతంతో అనుసంధానించి గుట్టలను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ పూర్తయిందని చెప్పారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి, డ్రైనేజీ సమస్యలను లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. అంబేద్కర్‌నగర్‌లోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కార్పొరేషన్‌ అధికారులు టెండర్లు పిలిచారని, త్వరలో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై ఆక్యుపెన్సీ పరిశీలన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బయోమైనింగ్‌, పారిశుధ్యానికి ప్రాధాన్యం

నగర పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. చెత్తను ఒకేచోట డంపింగ్‌ చేయడం కంటే బయోమైనింగ్‌, బయో సీఎన్‌జీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఉన్న పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరిచి వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. కొత్త డంపింగ్‌ యార్డు కోసం అన్వేషణ కంటే అందుబాటులో ఉన్న వ్యవస్థను సమర్థంగా వినియోగించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా చర్యలు

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్‌ తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. బూత్‌ స్థాయి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఐఏఎస్‌ లక్ష్యంతో సివిల్స్‌లోకి

తన వ్యక్తిగత ప్రస్థానాన్ని కూడా చాహత్‌ బాజ్‌పేయి ఈ సందర్భంగా వివరించారు. మధ్యప్రదేశ్‌లోని గుణలో పదో తరగతి వరకు, గ్వాలియర్‌లో ఇంటర్‌ విద్యను పూర్తి చేసినట్లు తెలిపారు. 2016లో ఐఐటీ కాన్పూర్‌లో విద్యుత్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశానన్నారు.

తన తండ్రి ప్రభుత్వ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేశారని, ఉన్నతాధికారులతో ఆయనకు ఉన్న పరిచయాలు, పరిపాలనా బాధ్యతలపై ఆయన చెప్పిన విషయాలు తనపై ప్రభావం చూపాయని తెలిపారు. ప్రజలకు విస్తృతంగా సేవ చేసే అవకాశం సివిల్‌ సర్వీసుల్లో ఉంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేశానన్నారు.

ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలోనే తొలిసారి సివిల్స్‌ పరీక్ష రాశానని, మూడో ప్రయత్నంలో విజయం సాధించానని చెప్పారు. సివిల్స్‌ శిక్షణ సమయంలోనే వరుణ్‌ రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు.
🏠 Home