🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

జ్వరం వస్తే.. ముందు నంబరా? వైద్యమా?!

Main Image Additional Image Additional Image
నిత్యం నిఘా,వర్ధన్నపేట:.


— 20 నిమిషాలు ఎదురుచూసినా వైద్యం అందలేదని రోగి ఆవేదన…

— “ముందు నంబర్ వేయించుకుని రండి” అంటూ సిబ్బంది సూచనపై ప్రశ్నలు


ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు సకాలంలో వైద్యం అందించే భరోసా కేంద్రం. అయితే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు ముందుగా ఓపీ నంబర్.. ఆ తర్వాతే వైద్యం అన్నట్లుగా పరిస్థితి ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జ్వరంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సుమారు 20 నిమిషాల పాటు నిరీక్షించినప్పటికీ వైద్య సేవలు అందలేదని సమాచారం. చివరకు సిబ్బంది చేతికి ఓ షీట్ ఇచ్చి, ముందుగా నంబర్ వేయించుకుని రావాలని సూచించినట్లు రోగి వాపోయాడు.

అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వ్యక్తి వైద్యుడిని కలిసేందుకు ముందుగా నంబర్ తీసుకోవడం సాధారణ ప్రక్రియే అయినప్పటికీ, అస్వస్థత తీవ్రంగా ఉన్న రోగుల పరిస్థితిని బట్టి తక్షణ వైద్య సహాయం అందించే విధానం ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జ్వరం, నీరసం, తీవ్రమైన అస్వస్థతతో వచ్చే వారిని ఎక్కువసేపు నిరీక్షింపజేయకుండా ప్రాథమికంగా పరిశీలించి అవసరమైన వైద్యం అందించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో, గౌరవప్రదంగా వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఓపీ నంబర్ విధానంతో పాటు అత్యవసరంగా వచ్చే రోగులకు తక్షణ వైద్యం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

రోగుల ఇబ్బందులపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి, ఓపీ నంబర్ విధానం అమలు తీరును సమీక్షిస్తారా? అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు వేగంగా వైద్యం అందించే చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాలి.
🏠 Home