🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

# శవానికే రక్షణ లేదా?

Main Image
నిత్యం నిఘా,వర్ధన్నపేట:..

—వర్ధన్నపేట శవపరీక్ష గదిలో దారుణం.. మృతుడి కంటిని కొరికేసిన ఎలుకలు

—ఫ్రీజర్ సౌకర్యం, పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు.. అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం

వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలలని శవపరీక్ష గదిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయపర్తి మండలానికి చెందిన గారే వీరయ్య మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా మృతుడి కంటి భాగాన్ని ఎలుకలు కొరికేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆదివారం ఉదయం పోస్టుమార్టం కోసం మృతదేహం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. అప్పటికే విషాదంలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన మరింత వేదనను మిగిల్చింది. మృతదేహాన్ని భద్రంగా ఉంచాల్సిన శవపరీక్ష గదిలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

— కనీస సౌకర్యాలు ఎక్కడ?

శవపరీక్ష గదిలో మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, ఎలుకల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మృతుడి బంధువులు ఆరోపించారు. మృతదేహానికి కనీస రక్షణ కల్పించలేని స్థితిలో ప్రభుత్వ వైద్యశాల నిర్వహణ కొనసాగడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

“జీవించి ఉన్నప్పుడు రక్షణ కల్పించలేకపోయినా.. కనీసం చనిపోయిన తర్వాతైనా మృతదేహానికి గౌరవం, రక్షణ ఉండాలి కదా?” అంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

— ఉన్నతాధికారులు స్పందించాలి

శవపరీక్ష గదిలోకి ఎలుకలు ఎలా ప్రవేశించాయి? మృతదేహాల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫ్రీజర్ సౌకర్యం ఎందుకు అందుబాటులో లేదు? పారిశుధ్య నిర్వహణను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి శవపరీక్ష గది నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలని, మృతదేహాల భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

మృతదేహానికే రక్షణ కల్పించలేని పరిస్థితి వెలుగుచూడటంతో వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలలోని సౌకర్యాలు, నిర్వహణ తీరుపై మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
🏠 Home