🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

ఓటమితో ఆగలేదు.. ప్రజల మధ్యే నా పోరాటం!

Main Image Additional Image Additional Image Additional Image Additional Image
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ):

చట్టసభకు దూరమైనా.. జనసభలో పోరాటం కొనసాగిస్తున్నా!

నిరుద్యోగ సమస్యకు నిర్దిష్ట జాబ్‌ క్యాలెండర్‌ అవసరం: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి

ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ ప్రయాణంలో సహజమేనని, అయితే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే తన లక్ష్యమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా నిరాశ చెందలేదని, చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకపోయినా జనసభలో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని తెలిపారు.

‘‘గో హెడ్‌ రాకేష్‌’’ అంటూ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తితో గత రెండున్నరేళ్లుగా ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నానని చెప్పారు. విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుంటూ వారి హక్కుల కోసం పోరాడుతున్నానని తెలిపారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన రాజకీయ ప్రస్థానం, ప్రజా సమస్యలపై చేపట్టిన పోరాటం, సమకాలీన రాజకీయ అంశాలపై రాకేష్‌రెడ్డి మాట్లాడారు.

15 రోజుల ముందే ఎన్నికల బరిలోకి..

బీఆర్‌ఎస్‌లో చేరిన కొద్దిరోజులకే పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని రాకేష్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు మాత్రమే తాను బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు, ఉమ్మడి జిల్లాల నాయకుల సహకారంతో ఎన్నికలను ఎదుర్కొన్నానని చెప్పారు.

విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా అన్ని వర్గాల పట్టభద్రులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయానని, ఓట్ల లెక్కింపులో అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. అయితే ఆ ఓటమితో తాను నిరాశ చెందలేదన్నారు.

ఒకరోజు కేసీఆర్‌ తనను పిలిచి మాట్లాడి పోరాడుతూ ముందుకు వెళ్లాలని సూచించారని తెలిపారు. చట్టసభలోకి వెళ్లలేకపోయాననే బాధ కంటే జనసభలో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందనే భావనతో ముందుకు సాగుతున్నానన్నారు.

రెండున్నరేళ్లుగా సమస్యలపై పోరాటం

గత రెండున్నరేళ్లుగా విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని రాకేష్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నానన్నారు. జీఓ 46, జీఓ 29, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వివాదాలు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని చెప్పారు.

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నానన్నారు. నిరుద్యోగ బాకీ కార్డు ఉద్యమం, జలవిహార్‌లో సభ, యువసంగ్రామం వంటి కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్నానన్నారు.

నిరుద్యోగ సమస్యకు జాబ్‌ క్యాలెండర్‌ అవసరం

నిరుద్యోగం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని రాకేష్‌రెడ్డి అన్నారు. యూపీఎస్సీ తరహాలో నిర్దిష్టమైన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే వ్యవస్థ రాష్ట్రంలో ఉండాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక నిరుద్యోగులు ఏళ్ల తరబడి పట్టణాల్లో అద్దె గదుల్లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్నారని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

హనుమకొండ సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్తే నిరుద్యోగుల పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో చాలామంది వయోపరిమితిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌పై ఆందోళన వంటి కారణాలతో కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతానికి చెందిన వేణు ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని రాకేష్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నెలనెలా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందడం లేదని, కొన్ని సందర్భాల్లో వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల కుటుంబాల జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌పై ప్రశంసలు

కేసీఆర్‌ను శిఖర సమాన నాయకుడిగా రాకేష్‌రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయం, సాగునీరు, రైతులు, విద్య, ఉద్యోగాలు, సంక్షేమం తదితర రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు.

జెన్‌జీ తరానికి కేటీఆర్‌ సరైన నాయకుడని రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. టీ-హబ్‌, టీఎస్‌ఐపాస్‌, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా యువత, సాంకేతిక రంగంపై దృష్టి సారించారని అన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

‘ఉద్యోగాలన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇచ్చాం’

తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టామని రాకేష్‌రెడ్డి తెలిపారు. పోలీసు, ఉపాధ్యాయ, ఇతర శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేశామని, సింగరేణిలో కారుణ్య నియామకాల సమస్యను పరిష్కరించామని అన్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విడుదలైన కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్నికల కోడ్‌ తదితర కారణాలతో నిలిచిపోయాయని చెప్పారు. ప్రస్తుతం వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేస్తూ తమ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం మరోసారి తనకు అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉందని రాకేష్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తానని అన్నారు.

బిట్స్‌ పిలానీలో డ్యుయెల్‌ డిగ్రీ.. ఆర్థిక అంశాలపై ఆసక్తి

తన స్వస్థలం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ గ్రామమని రాకేష్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు ఏనుగుల కోమల, గోపాల్‌రెడ్డి అని చెప్పారు. పదో తరగతి వరకు వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, ఇంటర్‌ గుంటూరులోని విజ్ఞాన్‌ కళాశాలలో చదివానన్నారు. ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించడంతో బిట్స్‌ పిలానీలో ప్రవేశం లభించిందని తెలిపారు.

అక్కడ ఐదేళ్ల డ్యుయెల్‌ డిగ్రీ పూర్తి చేసి విద్యార్థి నాయకుడిగా పనిచేశానన్నారు. అనంతరం ఏడేళ్లపాటు బెంగళూరు, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశానని చెప్పారు.

2013లో బీజేపీలో చేరానని, అనంతరం పదేళ్లపాటు వరంగల్‌లో పార్టీ బలోపేతానికి పనిచేశానని తెలిపారు. మురికివాడల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని, వరదల సమయంలో బాధితులకు తనవంతు సహాయం అందించానన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు.

ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న తనకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంశాలపై లోతైన అధ్యయనం చేసే అలవాటు ఉందని రాకేష్‌రెడ్డి తెలిపారు. ప్రముఖ దినపత్రికలో ఆర్థిక, సామాజిక అంశాలపై వ్యాసాలు రాశానని, వాటిని సంకలనం చేసి ‘ప్రగతి రథ చక్రాలు’ పుస్తకాన్ని రచించానని చెప్పారు.

అలాగే పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ‘తెలంగాణ ఎకానమీ’ పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో రచించానని తెలిపారు. ‘నవశకానికి నాంది’ వంటి పుస్తకాలను కూడా రచించినట్లు రాకేష్‌రెడ్డి వివరించారు.
🏠 Home