తలవంచలేదు.. పోరాటాన్నే వీడలేదు
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ):
తలవంచలేదు.. పోరాటాన్నే వీడలేదు
ఉద్యమంలో ముందున్నా.. స్వరాష్ట్రంలో అధికారానికి దూరమయ్యా
ఉద్యమం నుంచి న్యాయస్థానం వరకు : గుడిమళ్ళ రవికుమార్ ప్రస్థానం
తలవంచి బతకడం తనకు తెలియదని, సమస్యలను ప్రశ్నిస్తూ ఎదురిస్తూ జీవితాన్ని కొనసాగించానని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తనలాంటి ఉద్యమకారులకు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ, అధికార వ్యవస్థల్లో తగిన భాగస్వామ్యం ఎందుకు లభించలేదన్నదే తన ప్రశ్న అని పేర్కొన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం దక్కలేదన్న భావనతోనే మరోసారి పోరాటం చేపట్టాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుడిమళ్ళ రవికుమార్ తన బాల్యం నుంచి సామాజిక, న్యాయ, రాజకీయ ప్రస్థానం వరకు పలు అంశాలను వెల్లడించారు. వరంగల్‌లో పుట్టి రంగంపేటలో పెరిగిన తన బాల్యం సామాజిక అసమానతలను దగ్గరగా అర్థం చేసుకునేలా చేసిందన్నారు. తల్లి గుడిమళ్ళ పుష్పలీల ఎంజీఎంలో నర్సుగా, తండ్రి రాఘవేందర్రావు ఫార్మసిస్ట్‌గా పనిచేశారని తెలిపారు. వరంగల్‌లో విద్యాభ్యాసం అనంతరం ఎస్వీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించానన్నారు.
• మ్యాజిక్ వేదికే తొలి పాఠశాల
మ్యాజిక్ ప్రదర్శనలు తన జీవితంలో కీలక మలుపుగా నిలిచాయని రవికుమార్ తెలిపారు. మెజీషియన్ ఉమాపతి వద్ద మ్యాజిక్ నేర్చుకుని వందలాది ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. పది మంది ముందు నిలబడి మాట్లాడటం, విషయాన్ని స్పష్టంగా వివరించడం, ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడే ధైర్యం అక్కడే వచ్చిందన్నారు. 1982లో మిత్రులతో కలిసి మూన్లైట్ యూత్‌ను ఏర్పాటు చేసి వ్యాయామశాలను నిర్వహించడంతో పాటు నవచైతన్య అసోసియేషన్ ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మహిళా విద్యార్థినుల రక్షణ, వరద బాధితులకు సహాయం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు.
• సామాజిక ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం వైపు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1980 నుంచి 2000 మధ్య నెలకొన్న హింసాత్మక పరిస్థితులు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు. ఎన్కౌంటర్లు, మందుపాతరలు, అమాయకుల మరణాలు తనను కలచివేశాయని చెప్పారు. తెలంగాణ వెనుకబాటుతనం, ప్రాంతీయ అసమానతలపై అధ్యయనం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన అవసరాన్ని గుర్తించానన్నారు. శాంతియుత ప్రజా తెలంగాణ కోసం ఉద్యమంలో భాగస్వామినయ్యానని తెలిపారు. తెలంగాణ ప్రజా సమితి సదస్సులకు హాజరై ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాంధేయవాది భూపతి కృష్ణమూర్తి, ఆచార్య బి. జనార్ధన్‌రావు, ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తదితరులతో కలిసి వేదికలు పంచుకున్నానని వివరించారు.
• న్యాయస్థానంలోనూ పేదల తరఫునే
1995లో న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత కోర్టులోనూ వివక్షను ఎదుర్కొన్నానని రవికుమార్ తెలిపారు. చట్టాలపై పట్టు, ఆంగ్లం, హిందీ భాషలపై అవగాహనతో వృత్తిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. పేదలు, ఉద్యమకారుల కేసులను అనేక సందర్భాల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా వాదించానని చెప్పారు. 1998లో యువ న్యాయవాదుల సంఘాన్ని ఏర్పాటు చేసి న్యాయవాదుల వృత్తి నైపుణ్యాల పెంపునకు కార్యక్రమాలు నిర్వహించానన్నారు.
• పార్టీ ఆవిర్భావ రోజే గులాబీ కండువా
కొత్త రాజకీయ పార్టీ అవసరంపై 1998–99 ప్రాంతంలోనే ప్రొఫెసర్ జయశంకర్‌తో చర్చించానని రవికుమార్ తెలిపారు. 2001లో పార్టీ ఆవిర్భావ రోజున హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ఏడుగురు న్యాయవాదులతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నానన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు ఉద్యమ నేతలపై నమోదైన కేసుల్లో పారితోషికం తీసుకోకుండా న్యాయపరమైన సహాయం అందించానని చెప్పారు. యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పల్లెపల్లెకు వెళ్లి పార్టీ నిర్మాణంలో పనిచేశానని తెలిపారు. ఆటోడ్రైవర్లు, పూల వర్తకులను సంఘటితం చేసి ఉద్యమంలో భాగస్వాములను చేశానన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.
• ఎంపీ టికెట్ దక్కలేదని ఆవేదన
వరంగల్ ఎంపీ టికెట్ తనకు దాదాపుగా ఖరారైనప్పటికీ చివరి దశలో దక్కలేదని రవికుమార్ తెలిపారు. తనపై కొందరు నాయకులు రాజకీయంగా వ్యతిరేకంగా వ్యవహరించారని, తాను ఎన్నికై వస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నాయకత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. ఆ పరిణామాల కారణంగానే టికెట్ దూరమైందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
• ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిపై ఆందోళన
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిని తెలుసుకునేందుకు ఓదార్పు యాత్ర చేపట్టామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 17న వరంగల్‌లోని తొలిదశ ఉద్యమ అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభమైన యాత్ర నాలుగు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగిందన్నారు. మొత్తం 126 ఉద్యమకారుల కుటుంబాలను కలిశామని చెప్పారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన కుటుంబాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
• డిమాండ్ల సాధన వరకు పోరాటం
ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని గుడిమళ్ళ రవికుమార్ స్పష్టం చేశారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం, రూ.10 వేల కోట్లతో సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు, బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు స్వరాష్ట్రంలో న్యాయం జరగాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.