🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు పోరాటం

Main Image Additional Image Additional Image
నిత్యం నిఘా,బ్యూరో:

మామునూరు విమానాశ్రయానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌

తెలంగాణ వనరులు, నీళ్లు, ఉద్యోగాలపై జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి: తెలంగాణ అస్తిత్వ వేదిక


తెలంగాణలో స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం ఆంధ్రా కనుసన్నల్లో కొనసాగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్‌ వీరమళ్ల ప్రకాష్‌ ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం వరంగల్‌ నుంచే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు.

ఓబీసీ చైర్మన్‌, కుడా మాజీ చైర్మన్‌ సుందర్‌ రాజ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ హంటర్‌ రోడ్డులోని మాస్టర్‌జీ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వేదిక చైర్మన్‌ వీరమళ్ల ప్రకాష్‌, విశిష్ట అతిథిగా తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ కారం రవీందర్‌రెడ్డి, సమన్వయకర్త శ్రీధర్‌ దేశ్‌పాండే పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌, నల్ల నర్సింహులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా కళాకారుడు, ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, జీవిత సాఫల్య పురస్కార గ్రహీత వల్లంపట్ల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వీరమళ్ల ప్రకాష్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని ఆరోపించారు. జూరాల, కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని వనరులు, నీళ్లు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర పాలనలో ఇతర ప్రాంతాల ప్రభావం పెరుగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుతూ రాష్ట్ర అస్తిత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలనలోనూ సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాయని పేర్కొన్నారు. ప్రస్తుత పాలనపై ఆయన పలు విమర్శలు చేశారు.

మేడిగడ్డపై భిన్నాభిప్రాయాలు

మేడిగడ్డ బ్యారేజీ అంశంపై ప్రభుత్వం, వివిధ సంస్థలు వెల్లడించిన అభిప్రాయాలపై ప్రకాష్‌ ప్రశ్నలు లేవనెత్తారు. బ్యారేజీ పిల్లర్లు దెబ్బతినడానికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. వివిధ సంస్థలు పరిశీలించినప్పటికీ పూర్తి కారణాలు వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్రంగా నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

మామునూరు విమానాశ్రయానికి జయశంకర్‌ పేరు

మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెట్టాలని వీరమళ్ల ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో వరంగల్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రామప్ప ఆలయ పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు వేదిక పనిచేస్తుందని తెలిపారు.

తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జరగలేదని ఓబీసీ చైర్మన్‌, కుడా మాజీ చైర్మన్‌ సుందర్‌ రాజ్‌ యాదవ్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులు గద్దర్‌, జయశంకర్‌ విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజల ప్రయోజనాలకే వినియోగించాలని కోరారు.

తెలంగాణ సంస్కృతి, చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అస్తిత్వ వేదిక పనిచేస్తుందని, వరంగల్‌ నుంచే అస్తిత్వ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

వనరుల పరిరక్షణకు ఉద్యమం

తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్నాయని వేదిక సమన్వయకర్త శ్రీధర్‌ దేశ్‌పాండే ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గేయం విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని తెలంగాణ ఎన్జీవోస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడం మాత్రమే లక్ష్యం కాదని, అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి సాధించాలన్నదే ఉద్యమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అస్తిత్వ పరిరక్షణ కోసం వరంగల్‌ నుంచే పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ పిట్టల రవీందర్‌, ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ బుచ్చన్న, రాష్ట్ర గెజిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌రావు, తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం రాష్ట్ర సలహాదారు గంగాపురం వేణుమాధవ్‌, డాక్టర్‌ జేఏసీ నాయకులు నాగేంద్రబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్‌, గుల్లపల్లి చిరంజీవి, వద్దిరాజు గణేష్‌, తాడిశెట్టి క్రాంతి, కొక్కొండ విజయబాబు, రాచకొండ ప్రవీణ్‌, డాక్టర్‌ శ్రీరామ్‌ శ్యామ్‌, డాక్టర్‌ పాలమాకుల కొమరయ్య, డాక్టర్‌ వోడితల రాము, రావుల రాజకుమార్‌, గుండేటి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home