🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

కష్టాల కొలిమిలో కరిగిన ప్రస్థానం.. యాదగిరిగౌడ్‌ మనసులో మాట

Main Image Additional Image Additional Image Additional Image
నిత్యం నిఘా, బ్యూరో (హన్మకొండ):..

పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’తో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్న బొనగాని యాదగిరిగౌడ్‌

సాధారణ కుటుంబంలో జన్మించి.. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చదువుకున్నారు.. కాంట్రాక్టర్‌గా పనిచేశారు.. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ప్రజలకు చేరువయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్నారు. పదవులు, గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే పార్టీ కోసం పనిచేశారు. మరోవైపు గౌడ కులస్తుల సమస్యలపై తనవంతు పోరాటం చేస్తూ ముందుకు సాగారు. ఆయనే బొనగాని యాదగిరిగౌడ్‌.

ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’ పలకరించింది. సాధారణంగా పుట్టినరోజు అంటే శుభాకాంక్షలు, సంబరాలు, వేడుకలు. కానీ యాదగిరిగౌడ్‌తో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో ఆనందం కంటే జీవితంలో ఎదురైన కష్టాలు, రాజకీయంగా ఎదురుచూసిన గుర్తింపు, కార్యకర్తగా తాను పడిన ఇబ్బందులు, సామాజిక సేవలో చూసిన బాధలు ఎక్కువగా వినిపించాయి. తన మనసులో దాచుకున్న ఎన్నో విషయాలను ఆయన ‘నిత్యం నిఘా’తో పంచుకున్నారు.

చిన్ననాటి నుంచి కష్టాల ప్రయాణం

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామ ప్రాంతానికి చెందిన బొనగాని బక్కయ్య, సమ్మక్క దంపతులకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఏడో వ్యక్తి యాదగిరిగౌడ్‌. చల్వాయిలో పదో తరగతి, గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్‌, ములుగులో డిగ్రీ, హనుమకొండ ఆదర్శ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు.

చదువు పూర్తయిన తర్వాత సివిల్‌ కాంట్రాక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కూడా పనిచేస్తూ ప్రజలకు చేరువయ్యారు. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని కార్యకర్తలకు, స్వచ్ఛంద సంస్థలకు, ఆపదలో ఉన్న వారికి సహాయంగా అందిస్తూ వచ్చానని ఆయన తెలిపారు.

• కాంగ్రెస్‌ను నమ్ముకుని..

కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకంతో ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్న యాదగిరిగౌడ్‌ 2003లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన ములుగు నుంచి పార్టీ కోసం పనిచేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

తన రాజకీయ గురువుగా పొదెం వీరయ్యను పేర్కొన్న యాదగిరిగౌడ్‌.. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీని మాత్రం వీడలేదని చెప్పారు. పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనకు తగిన గుర్తింపు, సహాయం లభించలేదనే ఆవేదనను వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉంటే కార్యకర్తలకు, తనలాంటి వారికి తగిన స్థానం లభించేదనే ఆశ ఉండేదని, ఆయన మరణం తమకు తీరని లోటుగా మిగిలిందని యాదగిరిగౌడ్‌ తన మనసులోని మాటను పంచుకున్నారు.

• గౌడ కులస్తుల కోసం మరో పోరాటం

రాజకీయాలతో పాటు గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి కూడా యాదగిరిగౌడ్‌ తన వంతు కృషి చేస్తున్నారు. జిల్లా కార్యదర్శిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల వరకు కొనసాగింది.

గౌడ వృత్తిలోని కష్టాలను చిన్ననాటి నుంచే దగ్గరగా చూశానని ఆయన చెప్పారు. తాటి చెట్లపై పనిచేస్తూ ప్రమాదాలకు గురయ్యే గౌడ కులస్తుల పరిస్థితులు తనను ఎంతో కలచివేశాయని తెలిపారు. ప్రమాదాల్లో మృతిచెందిన కుటుంబాలకు తగిన పరిహారం అందాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందాలని కోరుతూ బాధితుల వెంట ఆసుపత్రుల వరకు వెళ్లిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.

వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన సందర్భాలు, వారి వైద్యానికి అవసరమైన సహాయం కోసం ప్రయత్నించిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

• పుట్టినరోజు వేళ.. మనసులోని మాట

పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’తో మాట్లాడిన యాదగిరిగౌడ్‌ మాటల్లో ఒక కార్యకర్తగా తన ప్రయాణం, ఎదురైన కష్టాలు, తనకు దక్కని గుర్తింపు, సమాజం కోసం చేయాలనే తపన స్పష్టంగా కనిపించింది.

జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా తనకు చేతనైనంత వరకు కార్యకర్తలకు, గౌడ కులస్తులకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని ఆయన తెలిపారు.

బొనగాని యాదగిరిగౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
🏠 Home