🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

వన్యప్రాణుల వేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం

Main Image
నిత్యం నిఘా,ఏటూర్ నాగారం:

వన్యప్రాణుల వేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం

కెమెరాల నిఘాలో చిక్కిన ఏడుగురు.. ఐదుగురికి 14 రోజుల రిమాండ్
ఇద్దరు పరారీలో.. ఖమ్మం కేంద్ర కారాగారానికి తరలింపు

ఏటూరునాగారం అభయారణ్యంలో వన్యప్రాణులను వేటాడుతున్న వారిపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల్లో చిక్కిన వేటగాళ్లను గుర్తించి విచారించగా మొత్తం ఏడుగురు ఈ నేరానికి పాల్పడినట్లు తేలిందని వన్యప్రాణుల క్షేత్రాధికారి హాట్కర్ రమేష్ వెల్లడించారు.

ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకొని ములుగు న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని ఖమ్మం కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

ఈ సందర్భంగా హాట్కర్ రమేష్ మాట్లాడుతూ.. అభయారణ్యంలోకి ఎవరూ అనుమతి లేకుండా ప్రవేశించరాదని హెచ్చరించారు. అటవీ ప్రాంతమంతా పలుచోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎవరైనా వేటకు పాల్పడినా, అక్రమంగా అడవిలోకి ప్రవేశించినా కెమెరాల నిఘాలో తప్పకుండా చిక్కుతారని స్పష్టం చేశారు.

వన్యప్రాణులను వేధించవద్దని, వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అడవిలోకి ప్రవేశించకుండా ఉండటం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించిన వారవుతారని పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కేసు దర్యాప్తులో వన్యప్రాణుల క్షేత్రాధికారి హాట్కర్ రమేష్, సెక్షన్ అధికారి ఆదినారాయణ, బీట్ అధికారులు పావని, రంజిత్ నాయక్, వినోద్‌తో పాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home