Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్రామాల్లో నూతన సీఐ విస్తృత పర్యటనలు

Author NITYAM NIGHA | 12 Sep 2026, 08:47 AM | Crime, హన్మకొండ
గ్రామాల్లో నూతన సీఐ విస్తృత పర్యటనలు

నిత్యం నిఘా,బ్యూరో:… ఎల్కతుర్తి ,…


— వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రతా చర్యలు

— బస్టాండ్‌, కళాశాలలు, వసతి గృహాలు, పారిశ్రామిక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా


ఎల్కతుర్తి సర్కిల్‌ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కే. శ్రీను సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎల్కతుర్తి, ముల్కనూర్‌, వంగర తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సీఐ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశమై నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

— రాత్రివేళల్లో ముమ్మర గస్తీ

ఇవి కూడా చదవండి

బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామాల్లో రాత్రివేళ గస్తీని ముమ్మరం చేసిన సీఐ.. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను గుర్తించి వారి వివరాలను పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రతి గ్రామంలో పోలీసుల గస్తీ నిరంతరం కొనసాగిస్తూ, చిన్నపాటి ఘటనలు సైతం పెద్ద సమస్యలుగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

— బస్టాండ్‌పై ప్రత్యేక నిఘా

ఎల్కతుర్తి మండలం హనుమకొండ, కరీంనగర్‌, సిద్దిపేట జిల్లాల సరిహద్దులకు సమీపంలో ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయని సీఐ పేర్కొన్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పరిశీలించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

— విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

ఎల్కతుర్తి మండల కేంద్రానికి సమీపంలోని ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ విశ్వవిద్యాలయం, ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్మసీ కళాశాల, ప్రభుత్వ, ప్రైవేట్‌ వసతి గృహాలు, మహిళల వసతి గృహాలు, రిలయన్స్‌ గ్యాస్‌, గ్రానైట్‌ పరిశ్రమలు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకునే సమయంలో పోలీసుల గస్తీ పెంచి వారి భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

— ప్రశాంత నిమజ్జనమే లక్ష్యం

వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌ శాఖ తరఫున అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని సీఐ కే. శ్రీను తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు.