Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం

Author NITYAM NIGHA | 21 Sep 2026, 09:00 PM | Politics, హన్మకొండ
వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం

హనుమకొండ, సెప్టెంబర్‌ 21 (నిత్యం నిఘా ):

బీసీ చైతన్యానికి విద్యే బలం

వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం - Additional Image

హక్కుల కోసం చైతన్యంతో ఉద్యమించాలి.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి

చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పులో భాగస్వాములు కావాలి

వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం - Additional Image

ఎంబీబీఎస్‌లో ఎదురైన అనుభవాలే నా పట్టుదలకు బలం

ఈటలే నా రాజకీయ గురువు: డాక్టర్‌ పగడాల కాళీ ప్రసాద్‌రావు

వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం - Additional Image

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీ ప్రసాద్‌రావు అన్నారు. సామాజికంగా జ్ఞానోదయం రావడంతో పాటు హక్కుల కోసం చైతన్యంతో ఉద్యమించాలని సూచించారు. అయితే సామాజిక మార్పు కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన బాల్యం, విద్య, వైద్య ప్రస్థానం, ఎంబీబీఎస్‌లో ఎదురైన సామాజిక వివక్ష, వైద్య రంగంలో మార్పులు, గార్డియన్‌ ఆస్పత్రి నిర్మాణం, ఐఎంఏలో తన ప్రయాణం, బీసీ సామాజిక చైతన్యం, రాజకీయ ప్రవేశం, ఈటల రాజేందర్‌తో తన అనుబంధం, పరకాల నియోజకవర్గంతో ఉన్న బంధం తదితర అంశాలను ఆయన పంచుకున్నారు.

వైద్యం నుంచి రాజకీయాల దిశగా.. పరకాలతో కాళీ ప్రసాద్‌రావు అనుబంధం - Additional Image

విద్యే వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు ఆయుధం

బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యకు ప్రత్యామ్నాయం లేదని కాళీ ప్రసాద్‌రావు అన్నారు. కేవలం హక్కుల కోసం నినదించడం కాకుండా వాటిని సాధించేందుకు సామాజికంగా చైతన్యవంతులు కావాలని సూచించారు. ఇతర వర్గాలను దూరం చేయకుండా తమ సమస్యలను వివరించి వారిని కూడా భాగస్వాములను చేసుకుంటే సామాజిక మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

‘నన్ను డాక్టర్‌ చేయాలనేది నాన్న కోరిక’

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక తన స్వగ్రామమని తెలిపారు. తల్లిదండ్రులు పగడాల వెంకటనర్సయ్య, వజ్రమ్మ అని చెప్పారు. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు కుటుంబం మారాల్సి వచ్చేదన్నారు. పదో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకున్నానని, పదో తరగతి చిట్యాలలో, ఇంటర్‌ పరకాలలో పూర్తి చేశానని తెలిపారు.

చిన్నతనం నుంచే తన తండ్రి తనను వైద్యుడిగా చూడాలని కోరుకునేవారని, అందుకే చదువుపై ఎంతో శ్రద్ధ పెట్టించేవారని గుర్తుచేసుకున్నారు. తోటిపిల్లలు ఆటలకు వెళ్లినా తాను మాత్రం పుస్తకాలతో కూర్చునేవాడినని చెప్పారు.

గ్రామంలోని ఉన్నత కుటుంబాల జీవనశైలి కూడా తనలో చదువుపై ఆసక్తిని పెంచిందన్నారు. బాగా చదువుకుంటే తాను కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే ఆలోచన చిన్నతనంలోనే ఏర్పడిందని తెలిపారు.

ఎంబీబీఎస్‌లోనే సామాజిక వివక్ష అనుభవం

ఇంటర్‌ వరకు కులం గురించి పెద్దగా ఆలోచించలేదని, మెడికల్‌ కాలేజీలో చేరిన తర్వాతే కుల వివక్షను ప్రత్యక్షంగా అనుభవించానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. కొందరికి నమస్కారం పెట్టినా స్పందించకపోవడంతో కారణం అర్థం కాక తొలుత తన దుస్తుల విషయంలోనే అనుమానం కలిగిందన్నారు.

తర్వాత కాలేజీలో ఉన్న సామాజిక వర్గాల సమీకరణలు, పరస్పర సహకారం వంటి అంశాలను గమనించానని చెప్పారు. తాను ఎదుర్కొన్న అనుభవాలు బాధ కలిగించినప్పటికీ అదే తనలో పట్టుదలను పెంచిందన్నారు. ఆ కసిని చదువు, వైద్యం, వృత్తిపరమైన ఎదుగుదల వైపు మళ్లించానని వివరించారు.

వైద్య రంగంలో కష్టపడి.. గార్డియన్‌ ఆస్పత్రి నిర్మాణం

ఎంబీబీఎస్‌, పీజీని కాకతీయ మెడికల్‌ కాలేజీలో పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం ఏటూరునాగారంలో రెండేళ్లు, ఎంజీఎంలో సుమారు 12 సంవత్సరాలు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశానన్నారు.

ఇవి కూడా చదవండి

వైద్య వృత్తిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలందించానని, ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసిన రోజులు ఎన్నో ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. రోగుల ప్రాణాలను కాపాడినప్పుడు కలిగే సంతృప్తి ప్రత్యేకమని అన్నారు.

2008లో గార్డియన్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసినప్పుడు కొందరు తనను నిరుత్సాహపరిచారని, అయితే తన ఆలోచనపై నమ్మకంతో ముందుకు సాగానని తెలిపారు. 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్పత్రిని ప్రారంభించినట్లు చెప్పారు. రోగులకు 24 గంటలూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆస్పత్రి పై అంతస్తులోనే నివాసం ఏర్పాటు చేసుకున్నానన్నారు.

పేదలకు సాధ్యమైనంత వెసులుబాటు కల్పించడమే తన విధానమని తెలిపారు. ట్రామా సర్జరీ రంగంలో తనకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

‘డాక్టర్‌–రోగి మధ్య దూరం పెరిగింది’

ప్రస్తుత వైద్య వ్యవస్థలో వైద్యులు, రోగుల మధ్య ప్రత్యక్ష సంబంధం తగ్గుతోందని కాళీ ప్రసాద్‌రావు అభిప్రాయపడ్డారు. గతంలో వైద్యులు రోగి నాడి పట్టి, సమస్యను అడిగి తెలుసుకుని వ్యాధిని అంచనా వేసేవారని, ప్రస్తుతం పరీక్షలు, మిషన్లపై ఆధారపడే పరిస్థితి పెరిగిందన్నారు.

వైద్య ఖర్చులు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో వైద్య రంగంలో మానవీయ దృక్పథానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఐఎంఏలోనూ బీసీల ప్రాతినిధ్యానికి కృషి

1997లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)లో సభ్యత్వం తీసుకున్నానని తెలిపారు. 2023లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినట్లు చెప్పారు. వైద్య రంగంలో బీసీలకు నాయకత్వ అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని, తాను అందుకు తన వంతు కృషి చేశానన్నారు.

తన ఇద్దరు కుమార్తెలు కూడా వైద్య రంగంలో ఉన్నారని తెలిపారు. పెద్ద కుమార్తె తేజస్వీ ఆప్తల్మాలజీలో ఎంఎస్‌ పూర్తి చేయగా, చిన్న కుమార్తె యశస్వి ఎండీ జనరల్‌ పూర్తి చేసినట్లు చెప్పారు.

‘ఈటలే నా రాజకీయ గురువు’

చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేదని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు రాజకీయాలపై ఆసక్తి మరింత పెరిగిందన్నారు. 1983లో ఎన్టీఆర్‌ను చూడటానికి స్నేహితులతో కలిసి రేపాక నుంచి సైకిళ్లపై పరకాలకు వచ్చిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

రాజబోయిన యాకయ్య ద్వారా ఈటల రాజేందర్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈటల సహకారంతోనే మెడికల్‌ కాలేజీ ప్రారంభించానని, ఆయననే తన రాజకీయ గురువుగా భావిస్తానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణం ఈటల రాజేందర్‌తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

‘పరకాలతోనే నా బంధం’

ఈటల రాజేందర్‌ ప్రోత్సాహంతోనే పరకాల నియోజకవర్గంలో పనిచేస్తున్నానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదని, ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల్లో భాగస్వామిగా ఉన్నానన్నారు.

పరకాల ప్రజలతో తనకు దీర్ఘకాలిక అనుబంధం ఉందని, ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తనవంతు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు.

‘చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలి’

రాజకీయాల్లో డబ్బు పెట్టి సంపాదించుకోవాలనే ధోరణి మారాల్సిన అవసరం ఉందని కాళీ ప్రసాద్‌రావు అన్నారు. చదువుకున్నవారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై బాధ్యతతో పనిచేయాలని సూచించారు. తాను రాజకీయాలను కూడా ఒక కోర్సులా అధ్యయనం చేస్తున్నానని, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు.

డీలిమిటేషన్‌పై జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందిస్తూ అధికారిక నిర్ణయం వెలువడే వరకు వస్తున్న ఊహాగానాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వైద్యుడిగా ఎదిగి, వైద్య సంస్థను నిర్మించి, సామాజిక చైతన్యం, బీసీల విద్య, హక్కుల అంశాలను ముందుకు తెస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్న తన ప్రయాణాన్ని కాళీ ప్రసాద్‌రావు చిట్‌చాట్‌లో వివరించారు.