Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు

రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు.. వెనక్కి తగ్గలేదు

13 ఏళ్ల డీసీసీ అధ్యక్ష పదవి నుంచి భూపాలపల్లి రాజకీయాల దాకా

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు - Additional Image

నా పనితీరే నా ఎదుగుదలకు కారణం.. భూపాలపల్లే నా కుటుంబం: గండ్ర వెంకటరమణారెడ్డి

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల కోసం చేసిన పనులు, ఎదుర్కొన్న పోరాటాలే తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, తన పనితీరే తన ఎదుగుదలకు కారణమైందని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావించి అభివృద్ధి కోసం పనిచేశానని, మరోసారి ప్రజల ఆశీర్వాదం లభిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు - Additional Image

తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి తన వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు.

విద్యార్థి దశ నుంచే ఉద్యమాల బాట

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు - Additional Image

పరకాలలో పుట్టి, హనుమకొండలో పదో తరగతి వరకు చదివినట్లు గండ్ర తెలిపారు. హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ విద్యను పూర్తి చేశానని, విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో తాను విద్యార్థి నాయకుడిగా పనిచేశానని, ఉద్యమాల కారణంగా విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయినట్లు చెప్పారు.

1989 నుంచి పూర్తిస్థాయి రాజకీయాలు

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు - Additional Image

1989 నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో పనిచేశానని గండ్ర పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్‌లో జిల్లా స్థాయిలో పనిచేసిన తాను 2001లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, సుమారు 13 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం పనిచేశానని, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించామని చెప్పారు.

2004లో టీడీపీ నుంచి తనకు శాసనసభ టికెట్‌ ఆఫర్‌ వచ్చినప్పటికీ, అప్పటివరకు తాను ఆ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పోరాటాల నేపథ్యంలో వెళ్లలేదని తెలిపారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు తన పనితీరు, ప్రజలతో ఉన్న సంబంధాలే కారణమని అన్నారు.

ఎమ్మెల్సీగా గెలుపు.. మంత్రి పదవి అవకాశాలు

ఇవి కూడా చదవండి

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని గండ్ర గుర్తుచేశారు. ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా రాజకీయ పరిణామాలు జరిగినప్పటికీ విజయం సాధించానన్నారు. 2011లో రెండుసార్లు మంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాలతో దక్కలేదని తెలిపారు. అనంతరం 2012లో చీఫ్‌ విప్‌గా బాధ్యతలు చేపట్టానని చెప్పారు.

2019లో బీఆర్‌ఎస్‌లో చేరిక

2019లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరినట్లు గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌లతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందన్నారు. కేసీఆర్‌ పనితీరు, పరిపాలనా విధానంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

భూపాలపల్లి అభివృద్ధే లక్ష్యం

భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావిస్తానని గండ్ర అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు, సింగరేణి కార్మికుల కోసం గృహాలు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి పనులు, రహదారుల అభివృద్ధికి కృషి చేసినట్లు వివరించారు. ఇంకా పరిష్కరించాల్సిన కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తనపై భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్నారని, అవి రాజకీయ ఆరోపణలేనని గండ్ర పేర్కొన్నారు. భూముల పరిరక్షణ కోసం తానే న్యాయపోరాటం చేశానని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటములకు పనితీరుతో సంబంధం లేకుండా పోతోందని అభిప్రాయపడ్డారు. తాను మరోసారి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుస్తానని, గతంలో చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా చేయాల్సిన పనులను ప్రజల ముందుంచుతానని తెలిపారు.

గౌతమ్‌ రాజకీయ ప్రవేశంపై స్పందన

తన కుమారుడు గండ్ర గౌతమ్‌ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తానని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నది గౌతమ్‌ వ్యక్తిగత నిర్ణయమని, తనకు నచ్చిన సమయంలో ప్రజా జీవితంలోకి రావచ్చని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని ఆకాంక్షించారు.