Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు

Author NITYAM NIGHA | 05 Oct 2026, 07:51 PM | Array
“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు

నిత్యం నిఘా బ్యూరో:

ప్రజా సమస్యలే మా ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు - Additional Image

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక

ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు.. రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు - Additional Image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు

మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు - Additional Image

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఆశించిన మార్పు పూర్తిస్థాయిలో రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన త్యాగాల ఆకాంక్షలు నెరవేరలేదని మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి అన్నారు. ప్రజల మౌలిక సమస్యలైన విద్య, వైద్యం, ఉపాధిని కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ వేదికను నిర్మించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక పద్ధతిలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన తన ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ అనుభవాలు, రాష్ట్ర పరిస్థితులు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యాచరణపై మాట్లాడారు.

• ‘తెలంగాణ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదు’

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు - Additional Image

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని, రాష్ట్ర వనరులు ప్రజలకే ఉపయోగపడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆశించామని పాపిరెడ్డి తెలిపారు. అయితే ఆ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, ప్రజలు అనేక పోరాటాలు చేశారని చెప్పారు. తాను కూడా 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పనిచేశానని, అనేక ప్రాంతాల్లో పర్యటించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యాసాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లానని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, ఇతర ప్రజా సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలను మరోసారి చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు.

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు - Additional Image

• వ్యవసాయం, పరిశ్రమలపై దృష్టి

తెలంగాణలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని పాపిరెడ్డి అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లోనూ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు బలోపేతం కాకుండా కేవలం సేవల రంగంపై ఆధారపడటం వల్ల ప్రజలకు శాశ్వత ఉపాధి, ఆదాయ భద్రత కల్పించలేమన్నారు.

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు - Additional Image

పాలకులు ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అందుకే ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

• విద్య, వైద్యం, ఉపాధే ప్రధాన ఎజెండా

ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని పాపిరెడ్డి తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వైద్య వ్యవస్థను మెరుగుపరచాలని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజా సమస్యలపై మళ్లీ ఉద్యమాలు నిర్మించాలని, విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటాలు చేయాలని చెప్పారు. డబ్బు ఒక్కటే రాజకీయాలకు ప్రాతిపదిక కాదని, నిజాయితీగా పనిచేస్తే ప్రజలే ఉద్యమాలకు అండగా నిలుస్తారని అన్నారు.

• ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తాం’

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక పద్ధతిలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. ప్రజాస్వామికవాదులు, వివిధ సామాజిక వర్గాలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని వర్గాల నుంచి స్పందన వస్తోందన్నారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, ఉపాధికి ప్రాధాన్యం ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

• ‘జన తెలంగాణ’ లక్ష్యంగా ముందుకు

కొత్త రాజకీయ వేదిక ఒక్క వ్యక్తి లేదా ఒక వర్గానికి పరిమితం కాదని పాపిరెడ్డి అన్నారు. ప్రజల కోసం పనిచేయాలనుకునే ప్రజాస్వామికవాదులు, వివిధ సామాజిక వర్గాలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలనే రాజకీయ ఎజెండాగా మార్చి, ప్రజలను చైతన్యపరచి ఉద్యమాలను నిర్మించాలన్నారు. తెలంగాణ కోసం జరిగిన త్యాగాల ఆకాంక్షలను సాధించే దిశగా తమ రాజకీయ ప్రయాణం సాగుతుందని చెప్పారు.

• ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ ప్రయాణం

తన కుటుంబ నేపథ్యం, ఉద్యమ ప్రస్థానాన్ని పాపిరెడ్డి వివరించారు. దామెర మండలం తక్కళ్లపాడుకు చెందిన తాను వరంగల్‌ ఆజంజాహి మిల్స్‌ కాలనీ సమీపంలోని గాంధీనగర్‌లో పెరిగినట్లు తెలిపారు. తన తండ్రి లక్ష్మీకాంతం స్వాతంత్య్ర సమరయోధుడని, కుటుంబంలో ఉన్న వామపక్ష భావజాల ప్రభావం తనపై పడిందని చెప్పారు.

తన అన్న మురళీమోహన్‌రెడ్డి విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమంలోకి వెళ్లారని, అత్యవసర పరిస్థితుల సమయంలో మెదక్‌ జిల్లా గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌లో 19 ఏళ్ల వయసులో మరణించారని తెలిపారు. అనంతరం తాను కూడా ఉద్యమ భావజాలం వైపు వెళ్లినట్లు వివరించారు.

1976లో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన తనను పోలీసులు అరెస్టు చేసి మూడు నెలల పాటు జైలులో ఉంచారని తెలిపారు. 1981లో మళ్లీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో వివిధ బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌తో పాటు హర్యానా తదితర ప్రాంతాల్లో పనిచేశానన్నారు.

అనారోగ్య కారణాలతో 2008లో అప్పటి హోంశాఖ మంత్రి జానారెడ్డి సమక్షంలో లొంగిపోయినట్లు తెలిపారు. అనంతరం 2009 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నానని చెప్పారు. ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ ఇప్పుడు కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు.

• పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ

ప్రజలను చైతన్యపరచడం, ప్రజా ఉద్యమాలను నిర్మించడం ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యమని పాపిరెడ్డి తెలిపారు. పార్టీ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని, రానున్న రెండు మూడు నెలల్లో పార్టీ పేరు పూర్తిస్థాయిలో ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రజాస్వామికవాదులు, వివిధ వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని, అందుకోసమే ‘జన తెలంగాణ’ దిశగా తమ ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. ప్రజల సమస్యలే తమ ఎజెండా, ప్రజలే తమ బలమని పేర్కొన్నారు.