Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీసుల ముందే కోడలిని ఇంట్లో బంధించారా?

Author NITYAM NIGHA | 25 Sep 2026, 03:22 AM | హన్మకొండ

నిత్యం నిఘా,హన్మకొండ:..

మూడు రోజులుగా తల్లీకూతుళ్ల నిర్బంధం.. తిండి లేక మనవరాలు అస్వస్థతకు గురైందని కుటుంబం ఆరోపణ
అదనపు కట్నం వేధింపుల కేసు.. గతంలో రాజీగా ఇల్లు, దుకాణం రాసిచ్చినట్లు వెల్లడి

హన్మకొండలోని రాంనగర్‌లో ఓ కుటుంబ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనను, కుమార్తె తేజస్వినిని అత్త మీరాబాయి ఇంట్లో బంధించి తాళం వేసిందని గూడూరు జయశ్రీ ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారు అక్కడికి వచ్చినప్పటికీ తమను ఇంట్లోనే నిర్బంధించినట్లు బాధితురాలు పేర్కొంది. మూడు రోజులుగా తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, కుమార్తె తేజస్విని కళ్లు తిరిగి పడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

బాధిత కుటుంబం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ 52వ డివిజన్ రాంనగర్‌కు చెందిన గూడూరు మీరాబాయి కుమారుడు రాధాకృష్ణకు వరంగల్ రంగశాయిపేటకు చెందిన జయశ్రీతో 2003లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.20 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలను జయశ్రీ తల్లిదండ్రులు సమకూర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం అత్త మీరాబాయి, భర్త రాధాకృష్ణ తనను వేధించారని జయశ్రీ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో భర్త ఇంటి ఎదుట ధర్నా నిర్వహించగా, పోలీసులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో రాంనగర్‌లోని ఇల్లు, హన్మకొండ చౌరస్తాలోని దుకాణాన్ని జయశ్రీకి రాసిచ్చినట్లు బాధిత కుటుంబం చెబుతోంది.

రాజీ జరిగిన పదేళ్ల అనంతరం మళ్లీ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని జయశ్రీ ఆరోపించింది. తనతో పాటు కుమారుడు కార్తికేయ, కుమార్తె తేజస్వినిని ఇంటి నుంచి బయటకు పంపించారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

— సెప్టెంబర్ 22న ఏం జరిగింది?

ఈ నెల 22న గుర్తుతెలియని వ్యక్తులను తీసుకొచ్చి తన ఇంట్లోని సామగ్రిని తరలించే ప్రయత్నం చేశారని జయశ్రీ ఆరోపించింది. కుమార్తె తేజస్వినితో కలిసి ఆమెను అడ్డుకుంది. వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చినట్లు తెలిపింది. అయితే పోలీసులు ఉన్న సమయంలోనే మీరాబాయి తమ ఇద్దరినీ ఇంట్లో బంధించి తాళం వేసి వెళ్లిపోయిందని జయశ్రీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో తన అత్తకు ఆమె కుమార్తెలు, అల్లుళ్లు సహకరించారని పేర్కొంది.

— మూడు రోజులుగా తిండి లేక..

ఇంట్లో బంధించబడి మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత తల్లీకూతుళ్లు వాపోయారు. తిండి, నీరు సరిగా లేక కుమార్తె తేజస్విని కళ్లు తిరిగి పడిపోయిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమను బయటకు తీసుకురావాలని కోరారు.

— ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఆవేదన

తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుగుమందు డబ్బాలు, పెట్రోల్‌ బాటిల్‌ చూపిస్తూ తమ పరిస్థితిని వివరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని బాధితులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

పోలీసుల సమక్షంలోనే ఇంట్లో బంధించినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత తల్లీకూతుళ్లకు వెంటనే రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.